జీవన సాగర మథనం

~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~

 

ఎంత కష్టపడ్డా ఫలితం లభించడం లేదని, దేవుడు కూడా సహాయం చేయడం లేదని బాధపడేవారికి ఒక విషయం వివరిస్తాను.

పూర్వం దేవతలు అమృతం తాగాలని ఆశించారు. ఆశించి ఊరుకుంటే అమృతం దొరకదు కదా. తమ అహాన్ని వదిలి, శత్రువులైన రాక్షసులతో సంధి చేసుకొని, వారు సాయం చేసేలా ఒప్పించారు. మంధర పర్వతాన్ని పాల సముద్రం మీదకు దించారు. వాసుకి పాముని తెచ్చి ఆ పర్వతానికి కట్టారు. రాక్షసులతో కలిసి సాగర మథనం చేశారు. అమృతం కోసం ఇంత కష్టపడితే, చివరికి విషం వచ్చింది. విసుగు చెందకుండా, బాధ పడకుండా శివుడి (దేవుడి) సాయంతో మళ్ళీ పని మొదలుపెట్టారు. ఈసారి విలువైన రత్నాలు వచ్చాయి. దేవతలు తృప్తి పడలేదు. ధనదేవత లక్ష్మీదేవి వచ్చింది. పని ఆపలేదు. చల్లని చంద్రుడు , అందాల అప్సరసలు, కోరికలు తీర్చే కల్పవృక్షం వచ్చాయి. ఎన్ని వచ్చినా సరిపెట్టుకోక అమృతం కోసం శ్రమించారు. అమృతాన్ని సాధించారు.

అలాగే మనం ఏదయినా గమ్యం కోసం కృషి చేస్తున్నప్పుడు విష పరీక్షలు ఎన్నో వస్తాయి. దేవతలకు విషం వచ్చినట్టే. కానీ వారు ఆ విషం వాళ్ళ చనిపోతే, అమృతం దొరికుతుందా? నువ్వు సహనం కోల్పోయి, ఆత్మహత్య చేసుకుంటే విజయం వరిస్తుందా? దేవతలు శివుడ్ని ప్రార్ధించారు. ఆయన వచ్చి విషం తాగేసాడు. అలాగే మన గమ్యానికి చేరే దారిలో విషపరీక్షలు ఎదురైతే ఆ దేవుడ్ని మనసారా ప్రార్ధించాలి.ఆయన మన ఆటంకాలు తొలగిస్తాడు. మళ్ళీ నడుం బిగించి సముద్రం చిలికినట్టు, మన ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టాలి. మధ్యలో రత్నాలు, కల్పవృక్షం, అందాల అప్సరసలు లాంటి చిన్నచిన్న విజయాలు వస్తాయి. తృప్తి పడి ప్రయత్నం ఆపకూడదు. అలా నిరంతరం కష్టపడితే మనం గమ్యం చేరి విజయం సాధిస్తాం.

ఇంకోమాట..

శివుడు వచ్చి విషాన్ని తాగాడు. కానీ, సముద్రం లో అమృతం తీసి దేవతలకు ఇవ్వలేదు. అది దేవతలు కస్టపడి సాధించుకున్నారు. దేవుడు పక్షులన్నిటికీ ఆహారం సమకూరుస్తాడు. అంటే, వాటి గూటిలోకి వచ్చి ఇవ్వడు. వాటి ఆహారం సంపాదించుకోడానికి సహాయం చేస్తాడు. అలాగే, మానవ ప్రయత్నం లేకుండా, దేవుడి మీద భారం వేస్తే, ఏ పనీ జరగదు.

విజయం తన స్థాయిని తగ్గించుకొని మన దగ్గరకు రాదు. అలా వస్తే దానికి విలువ లేదు.  మనం మన స్థాయిని పెంచుకొని దాన్ని సాధించాలి. నీ శక్తినంతా ఉపయోగించి, నీ పని నువ్వు చేయి, ఆ పైన దేవుడి మీద భారం వేయి. విజయం తనంత తానే నీ దగ్గరకు వస్తుంది.

నీకు అమృత ఫలం లభిస్తుంది.

కష్టే ఫలి !!

Comments to: జీవన సాగర మథనం

Your email address will not be published. Required fields are marked *

Attach images - Only PNG, JPG, JPEG and GIF are supported.