నోరు జారితే?

 

స్నేహ చాలా తెలివైన పిల్ల. చదువులలో మేటి. ఆటలలో తనకు తానే సాటి.

కానీ ఒక్కటే అవలక్షణం. వాళ్ళ స్నేహితులతో కలిసి ఎప్పుడూ అవతల వాళ్ళ మీద పుకార్లు, గాలి కబుర్లు  చెప్తూ ఉండేది.

ఈ విషయం వాళ్ళ అమ్మ శారద కి తెలిసి బాధ పడింది. ఆ పాడు స్నేహాలు వద్దు అని, మనం ఇతరుల గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళు బాధ పడతారు అని మందలించి తనని మార్చే ప్రయత్నం చేసింది.

దానికి స్నేహ “అమ్మా! నేను ఎవరినీ కొట్టడం లేదు, హాని చేయడం లేదు. సరదాకి మా స్నేహితులతో పుకార్లు చేస్తున్నాను. అది మాకు కాలక్షేపం. ఇంతమాత్రానికే నువ్వెందుకు అంతలా బాధ పడుతున్నావు ?” అని తిరిగి సమాధానం చేప్పేది.

దానికి శారద మనసు చివుక్కుమంది. తన కూతురుని మార్చే సమయం కోసం, సరయిన మనిషి కోసం ఎదురు చూడసాగింది.

ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ మహిమ గల సాధువు రోజూ ప్రసంగాలు చేస్తూ, ఊర్లో వాళ్లకి మంచి విషయాలు చెప్తూ, వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు కూడా సూచించి, వాళ్ళ మనస్సులు శాంత పరిచేవాడు. ఆ సాధువు గురించి ఆ నోటా, ఈ నోటా గొప్పగా విన్న శారద ఆయనను కలిసి, తన కూతురి సమస్య చెప్పింది. ఎలా అయినా తన కూతురి ప్రవర్తన మార్చమని చెప్పింది. దానికి సాధువు సరే అన్నాడు.

మరునాడు స్నేహని సాధువు దగ్గరకు తీసుకెళ్లింది శారద.

ఆ సాధువు “ఈరోజు మీ స్నేహితులతో ఏ ఏ పుకార్లు చెప్పి కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నావో, అవి అన్నీ ఈ కాగితం మీద రాయి” అని ఒక కాగితం, పెన్ను ఇచ్చాడు.స్నేహ ఆ కాగితం నిండా తాను ఆరోజు స్నేహితులతో చెపుదాం అనుకున్న పుకార్లు రాసింది.

“ఇప్పుడు ఆ కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చింపి ఊరంతా జల్లు. తర్వాత ఎప్పటిలాగానే నీ స్నేహితులతో కలిసి, ఈ కాగితం మీద రాసినవన్నీ వాళ్ళతో మాట్లాడు. రేపు పొద్దున్న వచ్చి నన్ను కలవు” అని చెప్పాడు.

ఓస్ ఇంతేనా! అనుకొని ఆ కాగితాన్ని బాగా చింపి చిన్ని చిన్ని ముక్కలుగా చేసి ఊరంతా జల్లింది స్నేహ. తరువాత సాధువు చెప్పినట్టుగానే ఆ పుకార్లు అన్నీ స్నేహితురాళ్ళతో చెప్పి, వాళ్ళతో షికార్లు చేసి ఇల్లు చేరింది.

మరునాడు తన తల్లితో వెళ్లి, “మీరు చెప్పినట్టే కాగితం ముక్కలు ముక్కలుగా ఊరంతా జల్లాను” అని గర్వంగా చెప్తుంది. అప్పుడు సాధువు “చాలా మంచిది అమ్మా ! ఇప్పుడు నువ్వు వెళ్లి నిన్న రోజంతా విసిరేసిన ఆ కాగితం ముక్కలు అన్నీ ఏరుకొని, తీసుకొని రా “ అని చెప్తాడు. స్నేహ ఊరంతా వితకడం మొదలు పెడుతుంది. సాయంత్రం దాకా అంగుళం అంగుళం వెతికినా తాను చింపిన ఒక్క కాగితం ముక్క కూడా కనిపించదు. దిగాలుగా సూర్యాస్తమయానికి సాధువు దగ్గరకు చేరి, నిజాయితీగా  “స్వామీ! నాకు ఒక్క ముక్క కూడా దొరకలేదు. నన్ను క్షమించండి” అని తల దించుకుంటుంది.

దానికి సాధువు “చూసావా తల్లీ! ఇప్పుడు నువ్వు పుకార్లు రాసి చింపిన ఆ కాగితం ముక్కలు ఒక్కసారి నీ చేయి జారితే, అవి ఎంత దూరం వరకు వెళ్ళాయో నీకు తెలీదు. అలా ఎగిరిపోయే ముక్కల్ని నువ్వు ఆపలేవు. అలాగే ఒక వ్యక్తి గురించి సరదా కోసం అయినా మనం తప్పుగా నోరు జారితే, అవి ఆనోటా ఈనోటా పాకి, ఎంత దూరం వరకు వెళ్తాయో మనకు తెలీదు. ఒక్కోసారి ఆ మాటలు ఒక వ్యక్తి జీవితాన్నే నాశనం చేయొచ్చు. ఒక్కసారి నోరు జారితే, ఎంత ప్రయత్నించినా వెనక్కి తీసుకోలేము. కాబట్టి హాస్యానికి కూడా ఎవరి గురించీ తప్పుగా మాట్లాడకు” అని చెప్తాడు.

 

ఆ రోజునుండీ స్నేహ గాలి కబుర్లు, పుకార్లు చెప్పడం, అలా ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తుంది. తన కూతురి ప్రవర్తన చూసి శారద ఎంతో సంతోషిస్తుంది.

 

నీతి: ఇక్కడి మాటలు అక్కడా, అక్కడి మాటలు ఇక్కడా చెప్పకండి. మీరు అలా తెలియకుండా మాట్లాడిన మాటలు, కొన్ని జీవితాలను నాశనం చేయొచ్చు. అలా ఒక్కసారి మాటలు జారితే మళ్ళీ వెనక్కి తీసుకోవడం కష్టం. కాబట్టి, ఆచి తూచి మాట్లాడండి.

 

Comments to: నోరు జారితే?

Your email address will not be published. Required fields are marked *

Attach images - Only PNG, JPG, JPEG and GIF are supported.