బ్రహ్మరాత

బ్రహ్మరాత

 

ఒకసారి కైలాసంలో పార్వతీపరమేశ్వరులు సంతోషంతో నాట్యం చేస్తూ ఆనందడోలికల్లో తెలియాడుతున్నారు. అదే సమయంలో రావణాసురుడు భక్తితో తన లంకానగరంలో శివపూజ చేయడం ఆ ఆది దంపతుల ఆనందాన్ని ఇంకా పెంచింది.

వెంటనే వారు లంకలో రావణుడి పూజా మందిరంలో ప్రత్యక్షమవుతారు. లంకాధిపతి ఆశ్చర్యంతో తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. శివపార్వతులను భక్తితో స్తోత్రం చేశాడు. అతని భక్తికి మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటారు శివపార్వతులు.

రావణుడు ”మీరు ప్రత్యక్షమవడమే మహా భాగ్యం. మీ పై ఎప్పుడూ నా మనసులో అనిర్వచనీయమైన భక్తి ఉండేలా చూడండి ” అని కోరాడు.

“తథాస్తు” అంటూ అదృశ్యమయ్యారు.

 

కైలాసంలో ..

శివుడు పార్వతితో “ప్రియా ! మన రావణుడి భక్తి చూశావా ? దేవతలు అసూయపడేలా బంగారంతో చేసిన లంకా నగరం ఉండి కూడా, నన్ను ఎప్పుడూ మర్చిపోకుండా భక్తితో పూజ చేస్తాడు” అని అన్నాడు.

అప్పుడు పార్వతి “అవును నాథా ! కానీ నాది ఒక చిన్న కోరిక. తీరుస్తారా?” అంది.

“చెప్పు దేవీ!” అన్నాడు శివుడు.

“మీ భక్తుడైన రావణుడికి అంత అందమైన బంగారు లంక ఉంది. మిమ్మల్ని పూజ చేసి ధనాధిపతి అయి అందమైన భవనం అలకాపురిలో కట్టుకున్నాడు కుబేరుడు. మరి దేవుళ్ళైనా మనకి ఒక మంచి ఇల్లు కూడా లేదే ? నాకూ ఒక మంచి ఇల్లు కావాలని ముచ్చటగా ఉంది. ఆ ఇంట్లో మనం మన పిల్లలైన వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వాములతో సంతోషంగా ఉండాలి. నా కోరికని మన్నించడం మీ కర్తవ్యం కదూ” అని గోముగా అడిగింది.

దానికి పరమశివుడు “మీ ఆడవాళ్లు బహు చమత్కారులు. మగవారి బలహీనతలను చూసి అడుగుతారు. సరే దేవీ ! నీ మాట అలా ఉంచితే, నేను స్మశానం లో ఉంటాను. నాకు ఇల్లు, నగలు, బంగారం మీద కోరిక లేదు. మనం ఈ జగత్తుకు తల్లిదండ్రులం. మనం కోరికలు తీర్చాలి, కోరికలను జయించాలి. కానీ కోరికల చిక్కుల్లో పడకూడదు” అన్నాడు.

అయినా పార్వతి తన మొండి పట్టు వీడలేదు.

ఇక చేసేదేమీ లేక శివుడు దేవతల శిల్పి ఐన విశ్వకర్మని పిలిచి “మాకు అన్ని లోకాలలో ఉన్న భవనాల కన్నా అందమైన భవనం చేసి ఇవ్వు” అని ఆదేశించాడు.

“తమ ఆజ్ఞ” అని చిటికెలో అలాంటి భవనం నిర్మించి ఇచ్చాడు విశ్వకర్మ.

 

తమ కొత్త భవనాన్ని చూస్తూ మురిసిపోయింది పార్వతీ దేవి. నంది, భృంగిల ద్వారా తమ ఇంటి గృహప్రవేశానికి దేవతలందరికీ ఆహ్వానం పలికింది.

అటుగా వెళ్తున్న శని దేవుడు ఆ భవనం యొక్క అందం గురించి విని, ముచ్చట పడి వచ్చాడు. భవనం చూశాడు. ఆయన చూపు పడగానే భవనం భస్మం అయింది.

 

అది చూసి పార్వతి విలపించింది. ఆ భవనం మళ్ళీ నిర్మించాలని శివున్ని కోరింది.

అప్పుడు శివుడు “సరే! కానీ ఒక షరతు ” అన్నాడు.

“ఏంటి నాథా?” అంది పార్వతి.

“నాకు ఇప్పటిదాకా ఇల్లు లేదు. ఇన్నాళ్లకు ముచ్చట పడి ఒక ఇల్లు కట్టుకుంటే, గృహప్రవేశం కాకుండానే భస్మం అయింది. అస్సలు నాకు సొంత ఇల్లు ఉండే యోగం లేనట్టు ఉన్నది. నేను నువ్వు కోరినట్టే ఇప్పుడు మళ్ళీ మన భవనం పునర్నిర్మిస్తాను.

దాని తర్వాత, బ్రహ్మ దేవుడి దగ్గరకు వెళ్లి నా రాత మార్పించుకొని వస్తాను. అలా కుదరని పక్షంలో ఒకసారి శంఖం ఊదుతాను. అప్పుడు నువ్వే ఈ భవనాన్ని భస్మం చేయాలి. ఒకవేళ నా రాత మార్చుకోగలిగితే రెండు సార్లు శంఖం ఊదుతాను. అప్పుడు మనం గృహప్రవేశం చేసుకొని ఆ భవనం లో ఉండొచ్చు” అని చెప్తాడు.

అందుకు పార్వతి సరే అంటుంది.

వెంటనే శివుడు తన మాయతో ఆ భవనాన్ని మునుపటిలా నిర్మించి బ్రహ్మలోకానికి వెళ్తాడు.

అక్కడ బ్రహ్మదేవుడితో తన తలరాతను మార్పిస్తాడు. ఈ సారి గృహప్రశానికి ఏ ఆటంకం కలగకుండా నవగ్రహాలను వాటి ఉన్నత స్థానాలలో ఉంచుతాడు. అలా అన్నీ అనుకున్నట్టు జరిగాయి అని ఆనందంతో ఒకసారి తన శంఖం ఊడుతాడు. ఈ సంతోషకరమైన వార్త వెంటనే పార్వతికి తెలియజేయాలని కైలాసానికి బయలుదేరతాడు. కానీ ఈ తొందరలో, తన శంఖాన్ని రెండోసారి ఊదటం మర్చిపోతాడు.

ఇక్కడ పార్వతి తన భర్త ఒక్కసారే శంఖం ఊదటం విని, ఆయన వెళ్లిన పని జరగలేదు అనుకొని విలపిస్తుంది. శివుడు చెప్పిన ప్రకారం తన భవనాన్ని భస్మం చేస్తుంది.

 

అటుగా వెళ్తున్న నారదుడు ఈ పరిస్థితిని చూసి పార్వతీదేవితో “అయ్యో అమ్మా ! మీ ఇంటి గృహప్రవేశం కోసం నేను వస్తే, మీరేంటి ఇలా చేశారు ?” అని అడిగాడు.

పార్వతి జరిగినదంతా చెప్తుంది. అప్పుడే శివుడు కూడా అక్కడికి వస్తాడు.

వెంటనే నారదుడు “అదేమిటమ్మా ? మా తండ్రిగారైన బ్రహ్మదేవుడు మీ ఆయన రాతని మార్చాడు అని విన్నాను. ఆయన ఇంకోసారి శంఖం ఊదడం మరిచిపోయి ఉండవచ్చు.  జగన్మాతవైన నీకు, జరిగింది తెలియదా? అలా ఎలా భస్మం చేశావమ్మా?” అని అడుగుతాడు.

పార్వతి కోపంగా చూస్తుంది.

నారదుడు భయపడి శివుడి వైపు తిరిగి “ఏంటి స్వామీ ? మీరు ఆది దేవుడు కదా ! రెండు సార్లు శంఖం ఊదడం ఎందుకు మరిచారు?” అని అడుగుతాడు.

శివుడు కూడా “నా ఒక్కడిదే తప్పా?” అన్నట్టు కోపంగా చూస్తాడు.

 

నారదుడికి ఏమి చేయాలో అర్ధం కాలేదు. భార్యాభర్తల గొడవలో తలదూర్చి ఇరుక్కుపోయాను అనుకున్నాడు.

వెంటనే శివుడు పార్వతులు నారదుడిని చూసి నవ్వుతారు. ఆశ్చర్యపోవడం నారదుడి వంతు అయింది.

పార్వతీదేవి “బాధపడకు నారదా! బ్రహ్మదేవుడు ఒకసారి రాసిన రాతను ఎవరూ మార్చలేరు.” అంటుంది.

జరిగేది అర్ధం కాని నారదుడు ఇంకా ఆశ్చర్యం లోనే ఉంటాడు.

అప్పుడు శివుడు “అవును నారదా! బ్రహ్మరాతను మార్చలేము అని నిరూపించాలనే, మేము ఆడిన చిన్న నాటకం ఇది. ఇందులో మా తప్పు కానీ, నీ తప్పు కానీ, ఆ శనీశ్వరుడు తప్పు కానీ లేదు. ” అని చెప్పి చిరునవ్వులు చిందిస్తాడు.

 

నీతి : బ్రహ్మదేవుడు ఒకసారి రాసిన రాతను ఎవ్వరూ మార్చలేరు

 

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *